shape

International ChotaNews

Blog Image

BREAKING: అమెరికాలో మరోసారి కాల్పులు

గతకొన్ని రోజుల క్రితమే అమెరికాలోని లాస్‌ఏంజల్స్‌లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా లాస్‌ఏంజల్స్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Blog Image

రూ.4.9 కోట్లకు ప్రిన్సెస్ డయానా గౌను

ప్రిన్సెస్ డయానా ధరించిన గౌను వేలంలో భారీ ధర పలికింది. న్యూయార్క్‌లోని సోత్‌బైస్‌లో నిర్వహించిన వేలంలో పర్పుల్ వెల్వెట్ కలర్‌లో ఉన్న ఈ గౌను రూ.4.9కోట్లకు అమ్ముడైనట్లు వేలం నిర్వహించిన సంస్థ తెలిపింది. తాము అనుకున్న దానికంటే అయిదు రెట్లు అధిక ధర వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. కాగా ఆ గౌనును ప్రిన్సెస్ డయానా 1991, 1997లో ధరించింది.

Blog Image

అక్కడ ఇంటి అద్దె అక్షరాల రూ.3లక్షలు

లండన్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది యజమానులు రూ. 2.5 లక్షలు చెల్లిస్తున్నారు. కొన్నిచోట్ల మూడు లక్షల వరకు పలుకుతోంది. కరెంటు రేట్ల పెంపుతో పాటు అద్దె పెంపుదల వల్ల ఉద్యోగాలు, ఇతరత్రా పనుల నిమిత్తం లండన్‌కు వచ్చిన భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఇబ్బంది పడుతున్నారు.గత ఏడాది లండన్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఇంటి అద్దె పెరుగుదల నమోదైంది.

Blog Image

నేపాల్‌లో విమానాల రాకపోకలు పునరుద్ధరణ

నేపాల్‌ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇమ్మిగ్రేషన్‌ సర్వర్‌లో సమస్యలు తలెత్తడంతో ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాలు దాదాపు రెండు గంటలకుపైగా నిలిచిపోయాయి. విమానాల రాకపోకలను పునరుద్ధంరించేదుకు ఎయిర్‌పోర్టు అధికారులు తీవ్రంగా శ్రమించారు.

Blog Image

నేపాల్‌లో నిలిచిన విమాన రాకపోకలు

నేపాల్‌ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇమ్మిగ్రేషన్‌ సర్వర్‌లో సమస్యలు తలెత్తడం వల్ల దాదాపు రెండు గంటల పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విమానాల రాకపోకలను పునరుద్ధరించేందుకు దాదాపు రెండు గంటల నుంచి ప్రయత్నాలు చేస్తున్నామని త్రిభువన్‌ ఎయిర్‌పోర్టు చీఫ్‌ ప్రేమ్‌నాథ్‌ ఠాకూర్‌ చెప్పారు.

Blog Image

ఇద్దరు మహిళలను కాపాడిన ఐఫోన్

ఆపిల్ సంస్థ తమ ఐఫోన్‌లో తీసుకొచ్చిన SOS ఫీచర్ కెనడాలో ఇద్దరు మహిళలను రక్షించింది. కెనడాకు చెందిన ఇద్దరు మహిళలు అల్బెర్టా నుంచి తిరిగి వస్తుండగా.. దట్టమైన మంచులో ఓ అటవీ ప్రాంతంలో చిక్కుకున్నారు. సహాయం కోసం ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ లేకపోవడంతో.. ఓ మహిళ తన ఐఫోన్ 14ను ఉపయోగించి SOS పంపించింది. దీంతో అధికారులు వారిని రక్షించారు.

Blog Image

అమెరికా సెనెట్‌లో టిక్‌టాక్ బిల్లు

చైనాకు చెందిన టిక్‌టాక్‌ను బ్యాన్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది.దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెలలో సెనేట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈయాప్‌ను బ్యాన్ చేయాలని కమిటీ ప్రతినిధి మిచెల్ మెక్‌కాల్ డిమాండ్‌తో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ బిల్లు పాస్ అవ్వాలంటే బిల్లుకు అనుకూలంగా 60% ఓట్లు రావాల్సి ఉంటుంది.

Blog Image

న్యూజిలాండ్‌లో కుండపోత

న్యూజిలాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని ఆక్లాండ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణం ఒక్కసారిగా మారడంపై న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్‌ హప్కిన్స్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తాను ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు బయలుదేరనున్నట్లు తెలిపారు.

Blog Image

నల్లజాతీయుడిని చావబాదిన అమెరికా పోలీసులు

నల్ల జాతీయుడిపై ఐదుగురు పోలీసులు దాడి చేయడంతో మృతిచెందిన ఘటన అమెరికాలోని మెంఫిస్‌లో జరిగింది. టైర్ నికోలస్ అనే 29 ఏళ్ల వ్యక్తి కారులో వెళ్తుండగా పోలీసులు ఆపి మూకుమ్మడిగా దాడి చేశారు. తాను ఇంటికి వెళ్తున్నా అని బాధితుడు చెప్తున్నా వినకుండా దాడి చేశారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Blog Image

గోవా సర్కారు సంచలన నిర్ణయం

గోవా సర్కారు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులతో చిత్రాలను క్లిక్ చేయాలనుకున్నప్పుడు వారి గోప్యతను గౌరవించేందుకు అనుమతి తీసుకోవాలని సూచించింది. పర్యాటకుల రక్షణ, గోప్యత, ఇతర విషయాలతో పాటు వారు మోసపోకుండా ఉండేందుకు గోవా టూరిజం డిపార్ట్‌మెంట్‌ పలు సూచనలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన టూరెస్ట్‌లపై జరిమానా విధిస్తామని పేర్కొంది.

Blog Image

మిస్సైన రేడియో యాక్టివ్ కాప్సుల్!

ఆస్ట్రేలియాలో హెల్త్ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రెడియో యాక్టివ్ కాప్సుల్స్ తీసుకెళ్తున్న ట్రక్ నుంచి ఓ కాప్సుల్ కనిపించకుండా పోయింది. దీంతో పశ్చిమ ఆస్ట్రేలియాలో ఎమర్జెన్సీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో తక్కువ పరిమాణంలో సీసియం-137 ఉంటుందని, దీనిని తాకినట్లయితే తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని అధికారులు చెప్పారు. కాబట్టి ప్రజలంతా 8x6 ఎంఎం కాప్సుల్ కనిపిస్తే దానికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Blog Image

విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం

.శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో విమాన ల్యాండింగ్‌ విషయంలో గందరగోళం నెలకొంది. ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గమ్యం చేరుకున్నామనుకున్న ప్రయాణికులకు గట్టిగా షాక్‌ తగిలింది. విమానం టేకాఫ్‌ కావడంతో.. భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. కాసేపటి తరువాత మళ్లీ పైలట్ విమానం సేఫ్‌గా లాండింగ్ చేయడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విజిబిలిటీ సరిగా లేనందువల్లనే ఇలా జరిగిందని తెలిపారు.

Blog Image

‘రష్యాను నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’

2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో రష్యా, బెలారస్ క్రీడాకారులు పాల్గొనకుండా నిలువరించేందుకు ఉక్రెయిన్ అంతర్జాతీయ క్యాంపెయిన్ చేపడుతుందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. దాంతో పాటుగా న్యూట్రల్ జెండా కింద రష్యా క్రీడాకారులు పాల్గొనడాన్ని జెలె‌న్‌‌స్కీ తప్పుబట్టారు. వారి జెండా రక్తంతో తడిసిందని అన్నారు. అయితే తమను అంతర్జాతీయ క్రీడల నుంచి నిలువరించేందుకు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని రష్యా ఇటీవల ప్రకటించింది.

Blog Image

సీనియర్ క్రికెటర్‌కు మంత్రి పదవి!

దేశంలోని పెరుగుతున్న సంక్షోభ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ చర్యలు చేపట్టింది. మంత్రిత్వ శాఖల్లో పలు మార్పులు తీసుకొస్తోంది. వీటిలో భాగంగా సీనియర్ క్రికెటర్ వహాబ్ రియాజ్‌ను క్రీడాశాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు రాజకీయ నిపుణులు తప్పుబడుతున్నారు.

Blog Image

ఓలా సీఈవోకు షాక్ ఇచ్చిన కోర్టు

ఓలా సంస్థ సీఈవోకు షాక్‌ తగిలింది. క్యాబ్‌లో ఏసీ పనిచేయకపోవడంపై ఓలాపై బెంగళూరు వ్యక్తి దావా వేశాడు.వాహనంలోని ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ విరిగిపోయిన కారణంగా కంపెనీపై దావా వేసి క్లయింట్‌కు 15,000 రూపాయలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది కోర్టు. .

Blog Image

ఘోరంగా పాక్ రూపాయి పతనం

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు రూపాయి భారీ షాక్‌ ఇచ్చింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా తయారైంది పాక్‌ పరిస్థితి. పొరుగు దేశం శ్రీలంకలాగే దివాళా దిశగా అడుగులేస్తోంది. డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ రూపాయి రూ.262.6గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పాక్ రూపాయి మారకం విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది.

Blog Image

ఉక్రెయిన్‌కు చేరనున్న 321 హెవీ ట్యాంక్‌లు

రష్యాతో యుద్ధం చేసేందుకు ఉక్రెయిన్‌కు మిత్రదేశాలు భారీగా సహాయం అందిస్తున్నాయి. తాజాగా మిత్రదేశాల నుంచి ఉక్రెయిన్.. 321 హెవీ ట్యాంకులు అందుకోనుందని ఫ్రాన్స్‌కు ఉక్రెయిన్ అంబాసిడర్ ఒమెల్చెంకో తెలిపారు. ‘‘ప్రతి దేశంతో డెలివరీ నిబంధనలు మారుతూ ఉంటాయి. కానీ మాకు ఈ డెలివరీ వీలైనంత త్వరగా కావాలి’’ అని ఆయన అన్నారు. ఇటీవల అమెరికా, జర్మనీ కూడా ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు అంగీకరించాయి.

Blog Image

అందుకు బాధ్యత వహిస్తా: మాజీ ఉపాధ్యక్షుడు

తన నివాసంలో రహస్య పత్రాలు లభించడంపై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్పందించారు. తన నివాసంలో పత్రాలు ఉన్న విషయం తనకు తెలియదన్నారు. ‘‘రహస్య పత్రాలు నా నివాసంలో ఉండకూడదు. తప్పు జరిగింది. అందుకు నేను పూర్తి బాధ్యత వహిస్తాను’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నివాసాల్లో కూడా రహస్య పత్రాలు లభించాయి.

Blog Image

అల్లాపై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అల్లాపై పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం పేరుతో స్థాపించబడిన ఏకైక దేశం పాకిస్థాన్ అని ఆయన అన్నారు. ‘‘ఒకవేళ పాకిస్థాన్‌ను అల్లా స్థాపించి ఉంటే దేశాన్ని ఆయనే కాపాడతాడు, అభివృద్ధి చేయగలడు’’ అని మంత్రి తెలిపారు. ఆ దేశంలో తీవ్ర ఆర్థిక, ఆహార కొరత తాండవిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Blog Image

దక్షిణాఫ్రికా ఆతిథ్యంలో బ్రిక్స్ సమావేశాలు

2023 బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశాలు ఆగస్టులో జరగనున్నాయి. వీటికి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికాలోని డర్బబన్ వేదికగా ఆగస్టులో 15వ బ్రిక్స్ సమావేశాలు జరగనున్నాయని రష్యా విదేశాంగ మంత్రి లవ్‌రోవ్ ప్రకటించారు. అయితే కరోనా నేపథ్యంలో గతేడాది చైనా ఆతిథ్యంలో ఈ సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించారు.

Blog Image

నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: మాజీ ప్రధాని

ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఈ- ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఓ ఉగ్ర సంస్థకు భారీగా నగదు ఇచ్చారని తెలిపారు. ఈ కుట్ర వెనుక మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలి జర్దారీ పాత్ర ఉందని అన్నారు. సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా ఆర్జించిన సొమ్మును తనను చంపడానికి జర్దారీ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

Blog Image

జెరూసలేంలో ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

ఇజ్రాయిల్‌లోని జెరూసలేంలోని యూదుల ప్రార్థనా మందిరం బయట ఓ ఉగ్రవాది కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మరణించగా మరో 11మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8:30గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.